ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడలేదు.. దేశవాళీలో పాతిక మ్యాచ్‌లు కూడా ఆడలేదు.. పైగా టీ20 ఫార్మాట్‌లో పెద్దగా అనుభవం లేదు.. అయినా ఓ కుర్రాడిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.3.80 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఆ సమయంలో ‘కుర్రాడికి ఎందుకు అంత డబ్బు’ అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కట్ చేస్తే.. ఐపీఎల్ 2025లో మెరుపు సెంచరీతో దుమ్ములేపాడు. ప్రస్తుతం ఆ కుర్రాడి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అతడి ఎవరో ఇప్పటికే అర్ధమైపోయుంటుంది. అతడే 24 ఏళ్ల ‘ప్రియాంశ్ ఆర్య’.
2001లో యూపీలోని ఫతేహ్‌నగర్‌లో ప్రియాంశ్ ఆర్య జన్మించాడు. ప్రియాంశ్ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉపాధ్యాయులు కాబట్టి.. దేశవాళీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2022లో అరంగేట్రం చేసిన ప్రియాంశ్.. 7 లిస్ట్ – A మ్యాచ్‌లలో 77 రన్స్ చేశాడు. అయితే 22 టీ20 మ్యాచ్‌లలో 731 పరుగులు బాదాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో 57, 82, 120 పరుగులు చేశాడు. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్‌పై ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టడంతో ప్రియాంశ్ అందరి దృష్టిలో పడ్డాడు. ఆ ప్రతిభతో సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో చోటు దక్కించుకున్న అతడు ఉత్తర్‌ప్రదేశ్‌పై సెంచరీ (102) కొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వచ్చిన ప్రియాంశ్‌ను పంజాబ్ రూ.3.80 కోట్లకు కొనుగోలు చేసింది.
పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ప్రియాంశ్ ఆర్యను కొనుక్కొని పక్కన పెట్టేయలేదు. ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్‌లోనే ఆడే అవకాశం కూడా ఇచ్చింది. గుజరాత్ టైటాన్స్‌పై 22 బంతుల్లోనే 47 రన్స్ చేసి అందరినీ షాక్‌కు గురిచేశాడు. లక్నో, రాజస్థాన్ మ్యాచ్‌లలో 8, 0 విఫలమయ్యాడు. అయినా ప్రియాంశ్‌పై మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆడించింది. మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెడుతూ.. 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో మెరుపు శతకం (103) బాదాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్ 2025లో ఆడిన 4 మ్యాచుల్లో 158 పరుగులు చేశాడు.