CM Chandrababu Naidu: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11, 12 తేదీల్లో ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ, పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తూ, దేవదర్శన కార్యక్రమాల్లో పాల్గొనడానికి సీఎం పర్యటన షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 11 (శుక్రవారం) నాడు ఏలూరు జిల్లా పర్యటన చేయనున్నారు. ఇందులో 11వ తేదీ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు ఆగిరిపల్లి మండలం వడ్లమాను వెళ్లేందుకు హెలికాప్టర్లో బయలుదేరుతారు. ఉదయం 10:20కి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు స్వాగతం పలుకుతారు. అనంతరం 10:30కు సీఎం బీసీ వర్గాల ప్రజలతో వారి పని ప్రదేశంలో సమావేశమవుతారు. 11:30కి ప్రజావేదిక వద్ద పబ్లిక్ ఇంటరాక్షన్ నిర్వహించనున్నారు. ఒంటి గంటకు పార్టీ కేడర్‌తో సమావేశం జరుగుతుంది. ఆపై మధ్యాహ్నం 2:30కి సీఎం హెలికాప్టర్లో విజయవాడ ఎయిర్ పోర్ట్ కు బయలుదేరుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:30కి సీఎం విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి కడప ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్ హౌస్‌కు 5 గంటల ప్రాంతంలో చేరతారు. ఆ తర్వాత 6 గంటల నుంచి 6:30 వరకు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్కడే 6:45 నుండి 8:30 వరకు జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో సీఎం పాల్గొంటారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. 8:40కి తిరిగి టీటీడీ గెస్ట్ హౌస్‌కు చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు.
Read Also: PBKS vs CSK: సెంచరీతో శివాలెత్తిన ప్రియన్స్ ఆర్య.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
ఇక ఏప్రిల్ 12 (శనివారం) ఉదయం 9 గంటలకు సీఎం కడప ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు బయలుదేరి, 10:30కి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక అంశాలపై ప్రజలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. రాజకీయంగా, పౌర సంబంధాల పరంగా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఉండనుంది.