మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొన్నాళ్ల క్రితం నుంచి వీరి వివాదాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. తాజాగా, మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో మనోజ్ సంచలన ఆరోపణలు చేస్తూ, తన ఇంట్లో విలువైన వస్తువులు, కార్లు దొంగిలించబడ్డాయని, జల్‌పల్లిలోని తన నివాసంలో విధ్వంసం జరిగిందని పేర్కొన్నాడు. ఈ ఘటనల వెనుక తన సోదరుడు విష్ణు ఉన్నాడని ఆరోపిస్తూ, పోలీసులను న్యాయం చేయాలని కోరాడు. అంతేకాదు మంచు మనోజ్ తన ఫిర్యాదులో పలు షాకింగ్ వివరాలను వెల్లడించాడు. తాను తన కూతురు బర్త్‌డే కోసం రాజస్థాన్‌కు వెళ్లిన సమయంలో, విష్ణు తన ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాడని ఆరోపించాడు. “నా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకెళ్లారు. గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించి, కార్లను దొంగిలించారు. ముఖ్యమైన వస్తువులను పగలగొట్టి, ఇల్లు ధ్వంసం చేశారు,” అని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Odela 2: ‘ఓదెల 2’ ట్రైలర్… గూస్‌బంప్స్ మెటీరియల్
చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసు వద్ద లభ్యమైనట్లు కూడా అతను ఆరోపించాడు. జల్‌పల్లిలోని తన ఇంట్లో 150 మంది చొరబడి విధ్వంసం చేశారని, ఈ ఘటనలు తన లేనప్పుడు జరిగాయని మనోజ్ తెలిపాడు. “నా సోదరుడు విష్ణు ఈ పని చేశాడు. నా ఇంటి నుంచి దొంగిలించిన వస్తువులు, కార్లను అతని ఆఫీసులోనే కనుగొన్నాము,” అని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ పరిణామాల గురించి తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నించినట్లు తెలిపాడు. “నా ఇంట్లో జరుగుతున్న ఈ ఘటనల గురించి తండ్రితో చర్చించాలని భావించాను. కానీ ఆయన నాతో మాట్లాడేందుకు సిద్ధంగా లేరు,” అని మనోజ్ వాపోయాడు. ఈ ఘటనల నేపథ్యంలో మంచు మనోజ్ నార్సింగి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, తనకు న్యాయం చేయాలని కోరాడు. “నా ఇంట్లో జరిగిన దొంగతనం, విధ్వంసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు మరియు నా కుటుంబానికి రక్షణ కల్పించి, దోషులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాను,” అని తెలిపాడు. ఈ ఫిర్యాదుతో మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.