Uttam Kumar Reddy : జలసౌధలో నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదులపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయల సీమ ఎత్తిపోతల పథకంతో పాటు బంకచర్ల ఎత్తిపోతల పథకం నిర్మాణాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిబంధనలకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందని, ఏపీ నిర్మిస్తున్న ఆర్ఎల్ఐసితో పాటు బంకచర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణా సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇక్కడి తాగు నీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
నీటిపారుదల స్టాండింగ్ కౌన్సిల్ సబ్యులతో పాటు అడ్వకేట్ జేనరల్ తో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి గోదావరి, కృష్ణా నదులలో తెలంగాణాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను కాపాడేందుకు సుప్రీంకోర్టులో కేసు వేస్తామని ఆయన పేర్కొన్నారు. 1980 లో జి.డబ్ల్యూ.డి.టి ట్రిబ్యునల్ ఉత్తర్వులు ,2014 ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రాజెక్టుల పూడిక తీత పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని, చెరువులలో రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యం పెంపొందించేందుకే పూడికతీత పనులు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.