Off The Record: అదిగో పులి అంటే….. ఇదిగో తోక అన్నట్టు తయారైంది తెలంగాణ కేబినెట్ విస్తరణ వ్యవహారం. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తం కుమార్‌రెడ్డి అలా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే… ఇలా కేబినెట్ విస్తరణ చర్చలు మొదలవుతాయి రాష్ట్రంలో. వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఇంటా బయటా అవే మాటలు. ఇటీవల అయితే… ఓ అడుగు ముందుకేసి విస్తరణ ముహూర్తం కూడా పెట్టేశారు కొందరు. ఏప్రిల్ 3 లేదా 4న విస్తరణ ఉంటుందని, ఐదుగురు కొత్త మంత్రులు కేబినెట్‌లోకి రాబోతున్నారని, ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేసేశారు. విస్తరణపై పార్టీ అగ్రనేతలతో చర్చించామని ప్రకటించారు పీసీసీ అధ్యక్షుడు. కానీ… అదే పీసీసీ చీఫ్… అనేక సమస్యలు ఉన్నాయంటూ ఆయన నోటితోనే చెప్పారు. ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. అధిష్ఠానానికి వివరాలు ఇచ్చారు. పెద్దోళ్ళు కూడా ఇక మీరు వెళ్ళండి మేం ఫైనల్ లిస్ట్ పంపుతామని చెప్పేశారట. అందుకే విస్తరణ ఖాయమన్న చర్చ జోరుగా జరిగింది అప్పట్లో. కానీ… ఆ తర్వాతి నుంచి ఒకడు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగానే ఉంది పరిస్థితి.
పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా… మరో ఆరుగుర్ని మంత్రులుగా తీసుకునే వెసులుబాటు ఉన్నా… రాష్ట్ర నాయకత్వం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలేదన్న ఫీలింగ్ ఎక్కువ అవుతోందట కాంగ్రెస్ నేతల్లో. దాంతో కేబినెట్ విస్తరణ ఎంత ఆలస్యం అయితే…సమస్య అంత జటిలంగా మారుతుందన్న అభిప్రాయం పెరుగుతోంది. అసలు నేడో, రేపో అన్నంతగా మూడ్ వచ్చి ఎందుకు ఆగిందని అంటే… రకరకాల కారణాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఎప్పుడూ లేనిది ఈ సారి మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు తమ కోటా కోసం అధిష్టానానికి లేఖలు రాయడం, ఎస్టీ సంఘాల నాయకులు రాహుల్ గాంధీని కలిసి గిరిజనులకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వమని కోరడం లాంటి పరిణామాలు జరిగాయి. ఇంతలోనే మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వండంటూ.. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు తెర మీదకు వచ్చారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సీనియర్ లీడర్ జానారెడ్డి… రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ సిఫారసు లేఖలు రాయడం కలకలం రేపింది. ఇవన్నీ కలగలిసి కొత్త సమస్యలు సృష్టించాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయట. కేబినెట్ బెర్త్‌ల సంగతి ఫైనల్‌గా తేల్చేది పార్టీ అధిష్టానమే. కానీ…వాళ్ళు మీనమేషాలు లెక్కించడానికి ఈ లెక్కలు కుదరకపోవడమేనా? అంతకు మించి ఇంకేమన్నా కారణాలున్నాయా అన్నది అంతు చిక్కడం లేదంటున్నారు రాష్ట్ర నాయకులు.
వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేసుకుని పరిపాలనలో ఇంకా స్పీడ్ పెంచాలని అనుకుంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కానీ… విస్తరణ వ్యవహారం ఎప్పటికప్పుడు దగ్గరకు వచ్చినట్టే వచ్చి ఆగిపోతోంది. ఏప్రిల్ 3..4 తేదీల్లో ఉంటుందని అందరు లెక్కలు వేసుకున్నారు. విస్తరణ అజెండాతోనే… సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీ వెళ్ళినా…. రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలతో బిజీగా ఉన్న కారణంగా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ఇక ఈ నెల 8..9న గుజరాత్ లో పార్టీ సమావేశాలు ఉన్నాయి. విస్తరణ ఉంటే గింటే…ఆ సమావేశాల తర్వాతనే అన్నది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అంటే… ఆ ప్రకారం ఈనెల 11, 12 వరకు ఆగుతారా లేక ఆలోపే చేస్తారా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం పాజ్ ఇచ్చినట్టేనంటున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి మరి.