పాలస్తీనియన్ ఉగ్రవాద సంస్థ హమాస్ సొంత ప్రజల పైనే తన కోపాన్ని చూపిస్తోంది. ఇటీవల గాజా స్ట్రిప్‌లోని ప్రజలు హమాస్‌కి వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ‘‘హమాస్ అవుట్’’ అంటూ నినదించారు. అయితే, ఈ పరిణామాలు హమాస్ ఉగ్ర సంస్థకు నచ్చలేదు. దీంతో సొంత ప్రజలనే ఉరితీసి చంపేస్తోంది.
హమాస్ ఇప్పటి వరకు కనీసం ఆరుగురు గాజా ప్రజల్ని ఉరితీసినట్లు తెలుస్తోంది. కొందరిని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం, చాలా మందికి బహిరంగంగా కొరడా దెబ్బల శిక్షను విధించింది. చాలా మంది గాజా వాసులు కనిపించకుండా పోయారు. అక్టోబర్ 07, 2023 నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్ చేసిన దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోతే, ఇజ్రాయిల్ దాడుల్లో హమాస్ నేతలతో పాటు సాధారణ ప్రజల మరణాలు 50,000 దాటింది.
ఈ నేపథ్యంలోనే గాజా ప్రజల్లో హమాస్ పట్ల వ్యతిరేక వ్యక్తమైంది. వేలాది జనాలు వీధుల్లోకి వచ్చి హమాస్‌కి వ్యతిరేకంగా నినాదాలు, నిరసనలు చేస్తున్నారు. ఇన్నాళ్లు తమకు అండగా ఉన్న ప్రజలు తిరగబడే సరికి హమాస్ తట్టుకోలేకపోతోంది. ‘‘ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ప్రజలు హమాస్‌ని కోరుకోవడం లేదు’’ అనే నినాదాలు వీధుల్లో ప్రతిధ్వనించాయి. అయితే, వీటిని క్రూరంగా హమాస్ అణిచివేస్తోంది. హమాస్ అధికారాన్ని ధిక్కరించే చర్యగా భావించి, ఆరుగురికి మరణశిక్ష విధించింది.
హమాస్ చంపిన వ్యక్తుల్లో గాజా నగరంలోని టెల్ అల్ హమా పరిసరాల్లో నివసించే 22 ఏళ్ల ఓడే నాజర్ అల్ రబాయ్స్ కూడా ఉన్నాడు. బహిరంగ నిరసనలకు పిలుపునిచ్చి, సోషల్ మీడియాలో హమాస్‌కి వ్యతిరేకంగా మాట్లాడిని రాబాయ్స్ ని హమాస్ వ్యక్తులు కిడ్నాప్ చేసి, నాలుగు గంటలు పాటు హింసించి, మరణించిన తర్వాత అతడి కుటుంబానికి డెడ్ బాడీని ఇచ్చినట్లు తెలిసింది. మెడకు తాడు కట్టి కుక్కపిల్లలా ఈడ్చుకెళ్లి, చంపేవారు. నిరసన తెలిపిన 22 ఏళ్ల వ్యక్తిని చంపినట్లు ఇజ్రాయిల్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ కూడా గుర్తించింది. హమాస్‌కి వ్యతిరేకంగా మాట్లాడిన మరో వ్యక్తిని కిడ్నాప్ చేసి, కొట్టి, కాళ్లపై కాల్చి గాయపరిచారు.
2019, 2023లో గాజాలో జరిగిన తిరుగుబాట్లను హమాస్ అణిచివేసింది. అయితే, ఈసారి మాత్రం నిరసనలు భిన్నంగా భావిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా హమాస్ చేస్తున్న యుద్ధం గాజాను తీవ్రంగా నష్టపరించింది. 18.5 బిలియన్ డాలర్ల విలువైన మౌలిక సదుపాయాలు నాశనమయ్యాయి. నిత్యం ప్రజలు ఇజ్రాయిల్-హమాస్ పోరులో ప్రాణాలు కోల్పోతున్నారు. వీటన్నింటి నుంచి స్వేచ్ఛ కోసం గాజా ప్రజలు నినదించడం హమాస్‌కి నచ్చక ఇలా చేస్తోంది. గతంలో ఉన్నట్లు హమాస్ బలంగా లేదు. దాని కీలక నేతల్ని ఇజ్రాయిల్ మట్టుపెట్టింది. ఇప్పుడు బలహీన హమాస్‌ని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, తన ఉనికి ప్రమాదంలో ఉండటంతో నిరసన తెలిపిన వారిని చంపేస్తోంది.