YS Jagan: దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంశంపై ఉత్తరాది.. దక్షిణాదిల మధ్య గంభీరమైన వాతవరణం నెలకొంది. చెన్నై కేంద్రంగా డీఎంకే ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కి సౌత్ సీఎంలు, పలు రాజకీయపార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని డీఎంకే ప్రతినిధులు వైసీపీని కూడా ఆహ్వానించారు. జగన్ గతంలో ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతు పలికాయి. కానీ జగన్ మాత్రం ఆయా పార్టీలకు ఎప్పుడూ మద్దతు పలకలేదు. ప్రస్తుతం వైసీపీ ప్రత్యర్థులైన టీడీపీ, జనసేన- బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. దీంతో ఆయన ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారని అంతా భావించారు. కానీ జగన్ మాత్రం ఆ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. స్టాలిన్ పెట్టిన సమావేశానికి ఆహ్వానం వచ్చినా హాజరుకాలేదు. పైగా అదే సమయంలో ప్రధాని మోడీకి లేఖ రాశారు. అందులో సుతిమెత్తగా కొన్ని సూచనలు, విజ్ఞప్తులు చేశారు. దక్షణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో కోరారు.
Read Also: Pooja Hegde : సినిమాల్లో హీరోయిన్లపై వివక్ష ఉంది.. పూజాహెగ్దే సంచలన కామెంట్స్
2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన నెలకొందన్నారు. జనభా నియంత్రణ పేరుతో గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గిందని లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు జనాభా ప్రకారం నియోజకవర్గాలను పునర్ విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం తగ్గుతుందన్నారు. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని జగన్ లెటర్‌లో కోరారు. వైఎస్ జగన్ ఇలా లెటర్ రాయడం- నొప్పింపక, తానొవ్వక అన్నట్టుగా ఉంది. ఇప్పుడంటే అధికారంలో లేరు కాబట్టి, కేంద్రంతో దూరంగా ఉన్నారు కానీ, జగన్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో మంచి టర్మ్సే ఉన్నాయి. దానిని చెడగొట్టుకోవడం ఇష్టం లేకే, బీజేపీ టార్గెట్‌గా స్టాలిన్‌కు సహకరిస్తున్న పార్టీలకు దూరంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అఖిలపక్షానికి హాజరు కాకపోయినా జగన్ రాసిన లేఖ సారాంశాన్ని డీంఎకేకు కూడా పంపించారు. అంటే జగన్ బీజేపీకి వ్యతిరేకం కాదని.. అలాగని వారికి అనుకూలంగా కూడా లేరని.. రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మోడీతో ఉన్న అనుబంధం దృష్ట్యా, సుతిమెత్తగా లేఖ రాసి ఉండొచ్చని భావిస్తున్నారు. పైగా స్టాలిన్‌కు సహకరిస్తున్న కాంగ్రెస్‌కి దూరంగానే ఉన్నామనే సంకేతాలు కూడా ఇచ్చారని అనుకుంటున్నారు. మరి భవిష్యత్తులో కూడా జగన్ ఇదే దూరం పాటిస్తారా? ఒకవేళ డీలిమిటేషన్‌తో దక్షిణాది సీట్లు నిజంగానే తగ్గితే, అప్పుడు స్టాండ్ మార్చుకుంటారా? చూడాలి..