Saudi Arabia: హజ్ భద్రతా సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా 14 దేశాలపై వీసా బ్యాన్ విధించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. ఈ ఏడాది హజ్ తీర్థయాత్ర ముగిసే జూన్ మధ్య వరకు ఈ నిషేధం ఉంటుంది. వీసా సస్పెన్షన్‌లో ఉమ్రా వీసాలతో పాటు వ్యాపార మరియు కుటుంబ సందర్శన వీసాలు కూడా ఉన్నాయి. సరైన రిజస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు వచ్చే వారిని నియంత్రించేందుకు సౌదీ అరేబియా ఈ దేశాలకు వీసాను నిషేధించింది.
Read Also: MA Baby: సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ.. ఆయన నేపథ్యం ఇదే..
అధికారిక అనుమతులు లేకుండానే చాలా మంది విదేశీయులు ఉమ్రా, విజిట్ వీసాలపై దేశంలోకి ప్రవేశించి, అనధికారికంగా హజ్ యాత్రలో పాల్గొని వెళ్లిపోతున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. హజ్ యాత్ర సజావుగా సాగడానికే సౌదీ అధికారులు ఈ కఠినమైన వీసా నిబంధనల్ని తీసుకువచ్చారు. హజ్ యాత్రకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ఇప్పటికే సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంట్లో భాగంగానే ఏప్రిల్ 13 వరకు మాత్రమే ఉమ్రా వీసాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ గడువు తర్వాత హజ్ ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయబడవు.
నిషేధం ఎదుర్కొంటున్న 14 దేశాల్లో.. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్ ఉన్నాయి. 2024లో జరిగిన విషాద సంఘటనల తర్వాత పకడ్బందీగా హయ్ యాత్రను నిర్వహించేందుకు సౌదీ అధికారులు సిద్ధమయ్యారు. 2024లో వేడిని తట్టుకోలేక 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది అనధికారిక యాత్రికులే.